హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన శివుని కీర్తనల గానం ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి చింతలపాటి రమాగోపాలకృష్ణ గారి బృందంచే కార్తీకమాసం సందర్భంగా 30.11.2024 శనివారం శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన శివపదం లోని శివుని కీర్తనల గానం కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, అంజనీదేవి, నాగలక్ష్మి, పావని లు తమ గాత్రధారణలో పంచామృతాలలో, శివుడు ధరించిన, నమఃశివాయ, శివతత్వమొక శిఖరమై, ఏరీతి కరుణింతువో వంటి కీర్తనలు చక్కగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్‌పై పాలపర్తి ఆంజనేయశర్మ, తబలాపై బాలజీ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం రమాగోపాలకృష్ణ గాయనీమణులను జ్ఞాపికలతో సత్కరించారు.