నరములు, వాస్కులర్ పై అవగాహన సదస్సు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికపై గురువారం కిమ్స్ శిఖర హాస్పిటల్స్, సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నరములు, వాస్కులర్ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సురపనేని ఫణీంద్రబాబు, డాక్టర్ బి. నవీన్ వెంకట్ లు పవర్ పాయింట్ ప్రజంటేషణ్ ద్వారా నరములు, రక్తనాళాలు వ్యవస్థలు శరీరంలో నాడీ సంకేతాలను, రక్త ప్రసరణను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలు దెబ్బతింటాయన్నారు. నరాల సమస్యల వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, స్పర్శ కోల్పోవడం పక్షవాతం వంటివి వస్తాయన్నారు. వాస్కులర్ వ్యాధుల వల్ల కాళ్ల ధమనుల్లో అడ్డంకులు, వెరికోస్ వేన్స్, రక్తం గడ్డకట్టడం, నడిచేటప్పుడు తీవ్రమైన కండరాల నొప్పి మానని పుండ్లు ఏర్పడతాయన్నారు. సమతుల్యాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొగతాగడం మానడం, బిపి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చన్నారు. అయితే, కాళ్లలో తీవ్రమైన వాపు, స్పర్శ కోల్పోవడం లేదా పక్షవాత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. . సీనియర్ సిటిజన్స్ అడిగిన సందేహాలకు డాక్టర్స్ తగు సలహాలు, సూచనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం డాక్టర్స్ ను ఘనంగా సత్కరించారు.
.jpeg)



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి