అలరించిన భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు, శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న, తిరుపతి వేంకట రమణ, హరే వేంకట రమణ బ్రోవరా, సప్తగిరులపై వెలసి వేంకటేశ, నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు, మాధవా కేశ మధుసూదన, ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి, నానాటి బ్రతుకు నాటకము, రంగ రంగ రంగపతి రంగనాధ్, చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్‌పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదేవ్, తబలపై పి. శివరామకృష్ణ చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం దేవాలయ పాలకవర్గం వారు భాగినారాయణశాస్త్రి అండ్ పార్టీ వారికి సన్మానించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి