వైభవంగా సంక్రాంతి సంబరాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయంలో మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. ఉదయం నుండి భక్తులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, ఆధ్యాత్మిక గోష్ఠితో సంబరాలను నిర్వహించారు. అన్నమయ్య కళావేదికపై క్రేన్ సంస్థ అధినేత గ్రంధి కాంతారావు దంపతులు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలను, మెట్ల పూజను ప్రారంభించారు. అయ్యప్ప స్వామిఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, విశేషపూజలు, అలంకరణ నిర్వహించారు. కర్పూర జ్యోతితో మకరజ్యోతి దర్శనాన్ని భక్తులకు కలిగించారు. ఉదయం ధార్మిక ప్రాంగణంలో విశ్వశాంతి, లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే లక్ష్మీగణపతి, రుద్ర, చండీహోమాలు నిర్వహించి పలు రకాల హెరామద్రవ్యాలతో పూర్ణాహుతి జరిగింది. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు సంబరాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చుక్కపల్లి రమేష్ బ్రదర్స్, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్, మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమమాహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరావు, సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి