జ్ఞానంతోనే దు:ఖం దూరం అవుతుంది - మానవత ఫౌండర్ ఎన్. రామచంద్రారెడ్డి
ఉపనిషత్తులు అందించిన జ్ఞానాన్ని పొందగలిగితే దుఃఖం మానవుని దరిచేరదని మానవతస్వచ్చంద సేవా సంస్థ ఫౌండర్ సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎన్. రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మానవత ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో గల అన్నమయ్య కళావేదికపై ఉపనిషత్తులపై ఆధ్యాత్మిక ప్రసంగం అనే కార్యక్రమానికి ఎన్. రామచంద్రారెడ్డి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ఎన్. రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ సృష్టిలో ప్రతిదీ ఏర్పాటు చేసిన తర్వాతనే భగవంతుడు మనిషిని పుట్టించాడని తెలిపారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, అందువల్లనే బిడ్డకు కూడా తల్లిపై అంతటి ప్రేమ కలుగుతుందని, త్యాగం ప్రేమకు చిహ్నమని పేర్కొన్నారు. అవసరానికి మించి ఉన్న ధనం సమస్యలను తెచ్చిపెడుతుందని, ఆర్థిక చింతలను వీడి మానవుడు ధర్మబద్ధంగా నడుచుకోవాలని, శాంతి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేత్రశరీర అవయవ దాన కమిటీ చైర్మన్ టి. సుందరరామయ్య అవయవ ఆవశ్యకత గురించి సభికులకు తెలిపారు.. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. చైర్మన్ పావులూరి రమేష్ సంస్థ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరిస్తూ నగర వాసులు ముందుకొచ్చి మానవతలో సభ్యులుగా చేరమని కోరారు. ఆద్యంతం అహ్లాదకరంగా జరిగిన కార్యక్రమంలో మానవత రాష్ట్ర అధ్యక్షులు ఎ. రామానుజులు రెడ్డి, గుంటూరు కార్యదర్శి కె. సతీష్, కోశాధికారి టీ.వీసాయిరాం, డైరెక్టర్లు ఉప్పలసాంబశివరావు, బి.ఎన్ మిత్ర, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి