అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
.jpeg)







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి