కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి బృందం నారాయణ నీ నామమే, శ్రీలక్ష్మీదేవి, కృష్ణమ్మా గోపాల బాలా, అన్ని రూపములకు నీవే తదితర కీర్తనలు ఆలపించారు. తబలపై పి. బాలాజీ, కీబోర్డుపై కె.రవి చక్కటి వాద్య సహకారం అందించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి