మార్చి 1 నుండి అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అష్టబంధన మహా సంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు మార్చి 01 నుండి 07 వరకు నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుండి 14 వరకు జరుగుతాయన్నారు. కుంభాభిషేకం మహోత్సవాలలో ప్రతిరోజు నిత్యపూజలు, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు జరిగే సంప్రదాయ సభలో పీఠాధిపతులు, మఠాధిపతులు, మాతాజీలు, పురప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొంటారన్నారు. కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా మార్చి 1న విశ్వక్సేనారాధన, పుణ్యావచనం, మేదిని పూజ 2న శేషవాహన సేవ, 3న గజవాహన సేవ, 4న హనుమత్ వాహన సేవ, 5న గరుడవాహన సేవ, సువాసిని పూజ, చండీహోమం, అష్టబంధ సమర్పణ 6న మహాశాంతి అభిషేకం, శాంతిహోమం, పూర్ణాహుతి, 7న శ్రీవారి కల్యాణోత్సవం కుంభాభిషేకం, మహపూర్ణాహుతి, అన్నసమారాధన జరుగుతాయన్నారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గురువారం 11న బ్రహ్మోత్సవముల అంకురారోపణ, 12న స్వామివారి శాంతి కళ్యాణం, 13న స్వామి దివ్యరధోత్సవం, 14న మహాపూర్ణాహుతి, అన్నసమారాధన, పవళింపు సేవ, పద్మావతి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా అభిషేకం, శ్రీపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి పుట్టా ప్రభాకర్‌రావు, ఆలయ అర్చకులు మాధవస్వామి తదితరులు పాల్గొని ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి