వైభవంగా గోదారంగనాథస్వామి వార్ల కళ్యాణం
స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు తిరుమల గోదాదేవి పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భోగి సందర్భంగా శ్రీకృష్ణుని అందంగా అలంకరించి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి చిన్నారులకు భోగిపండ్లను పోసి వేడుకగా జరిపారు. అనంతరం చివరి పాశురం ప్రవచనానంతరం అన్నమయ్య కళావేదికపై టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో 30 రోజులపాటు నిర్వహించిన తిరుప్పావై ముగింపుగా బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ, ఆలయ పాలకమండలి వారు కోగంటి వెంకట శ్రీరంగనాయకిని ఘనంగా సత్కరించారు. అంగరంగ వైభవంగా గోదారంగనాయక స్వామి కల్యాణోత్సవం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ అర్చకులు మాధవస్వామి బృందంచే ఎదురుకోలు, వర పూజ, పూర్ణాహుతి, నాగవల్లి సదస్యం, అప్పగింత కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి